బీర్బల్ జ్వరం

    Author: Unknown Genre: »
    Rating



    ఒక సారి బీర్బల్కి బాగా జ్వరమొచ్చి కొన్ని రోజులు రాజసభకు వెళ్ళలేదు. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజులు బీర్బల్ కనిపించకపోతే ఆత్రుతతో బీర్బల్ని చూడడానికి అతని ఇంటికి వెళ్ళారు.
    బీర్బల్ జ్వరం వల్ల నీరశించి, చిక్కి శైల్యం అయ్యి ఉన్నాడు.
    అక్బర్కి అతని అవగాహనా శక్తులు తగ్గాయేమో అని సందేహమొచ్చింది. అందుకే బీర్బల్ మంచినీళ్ళ కోసం పక్క గదిలోకి వెళ్ళినప్పుడు అక్బర్ అతని చేతి రూమాలు తీసి ఒక మంచం కోడు కింద పెట్టాడు.
    తిరిగి వచ్చి బీర్బల్ మంచం మీద పడుక్కుంటే యేదో తేడాగా ఉన్నట్టు అనిపించింది.
    అక్బర్ యేమి యెరగనట్టు బీర్బల్తో కబుర్లు చెబుతూ కూర్చున్నారు. కాని బీర్బల్ మట్టుకు ధ్యాసగా వినలేకపోయాడు.
    కొంతా సేపు ఇలా సాగాక, అక్బర్ బీర్బల్ పరధ్యానానికి కారణం యేమిటని అడిగాడు.
    “ఈ గదిలో యేదో మారినట్టుంది,” అని బీర్బల్ జవాబు చెప్పాడు.
    “మారిందా? యేమిటి మారిందంటావు?” అని అక్బర్ అన్నారు.
    “ఈ మంచం ఒక మూల యెత్తుగా వున్నట్టుంది,” అని అన్నాడు.
    “జ్వరమొచ్చి నప్పుడు అలా అనిపిస్తుంది,” అని అక్బర్ జాలి మొహం పెట్టి అన్నారు.
    “మహారాజా! నా శరీరానికి జ్వరమొచ్చింది కాని నా మెదడుకు రాలేదు!” అని బీర్బల్ నవ్వుతూ అక్బర్తో అన్నాడు.
    అక్బర్ కూడా నవ్వి అతను బీర్బల్కి పెట్టిన పరీక్ష గురించి చెప్పారు

    విష్ణు మహిమ

    ఒక రోజు అక్బర్ బీర్బల్ ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నారు.
    “బీర్బల్, నాకొక సందేహముంది, తీరుస్తావా? అలనాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెట్టాడని నేను వేద పురాణాలలో వుందని విన్నాను. యెందుకలా? అక్కడ సేవకులెవరూ లేరా?” అని అక్బర్ బీర్బల్ ని అడిగారు.
    బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు, “సమ్రాట్, మీ సందేహం నేను సమయమొచ్చినప్పుడు తీరుస్తాను!”
    కొన్ని రోజులు గడిచాయి. బీర్బల్ ఒక పనిమనిషిని పిలిచి ఆమె చేతికొక మైనపు బొమ్మను ఇచ్చాడు. బొమ్మ అచ్చు ఒక శిశువు రూపంలో ఉంది. “ఈ రోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు, ఈ బొమ్మని తీసుకుని నీట్లో పడిపోయినట్టు నటించు, నీకు మంచి బహుమానమిప్పిస్తాను,” అని ఆ పనిమనిషికి చెప్పాడు.
    అలాగే పనిమనిషి సాయంత్రం అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే తోట నడిమధ్య ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్టు నటించింది. తనతో పాటు ఆ శిశువు బొమ్మకూడ నీళ్ళల్లో పడిపోయింది.
    అక్బర్ ఈ దృశ్యం  చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్ళల్లోకి దూకి ఆ శిశువు బొమ్మని కాపాడ సాగాడు.
    బీర్బల్ మడుగు గట్టున నిలుచుని, “మహారాజా, యెందుకు మీరు నీళ్ళల్లో దూకరు? సేవకులని పురమాయిస్తే సరిపోయేది కదా?” అన్నాడు.
    “ఒక శిశువు ప్రాణాపాయ స్థిథిలో కనిపిస్తే మీరు యెలా ముందూ వెనకా చూడకుండా ఆదుకోవాలనుకున్నారో, విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగుని కాపాడడానికి వెనకాడలేదు” అని చాలా తెలివిగా అక్బర్ సందేహం తీర్చాడు.
    Curtosey : https://kathalu.wordpress.com/